: విరాట్ కోహ్లీని చుట్టుముట్టిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు
బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో నిన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌కు మ్యాచులో వందశాతం ఫీజుకోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై అవే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ విరాట్ ఈ చర్యకు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ నిన్న ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య ఈ నెల 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా తొలి టెస్టు మ్యాచు జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచులోనే కోహ్లీ ఈ చర్యకు పాల్పడ్డాడని సదరు మీడియా ఆరోపణలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియో ఆధారం కూడా ఉన్నట్లు చెప్పింది. ఇందుకోసం విరాట్ తన నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థం ఉపయోగించాడని ఫొటోలు కూడా విడుదల చేసింది. బంతి మెరుపును పోగొట్టేందుకు తన కుడి చేతిని నోట్లో పెట్టి ఆ తరువాత దాన్ని బంతికి రుద్దాడని ఆరోపించింది. ఇటువంటి చర్యను గమనిస్తే ఆటగాళ్లు లేదా అంపైర్లు ఐదు రోజులలోపు ఐసీసీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశంపై ఇంగ్లండ్ ఆటగాళ్లు గాని, అంపైర్లు గాని ఐసీసీకి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. రెండో టెస్టు మ్యాచు కూడా జరిగిపోయింది. కాగా, సదరు పత్రిక ఇటువంటి కథనాన్ని ప్రచురించడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.