: క్రిస్మస్ మార్కెట్లపై భారీ ఉగ్రదాడులు... హెచ్చరించిన అమెరికా
యూరప్ లో ఈ క్రిస్మస్ సీజన్ లో భారీ ఎత్తున ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు సెలవుల సీజన్ లో మారణహోమం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు 'టెలిగ్రాఫ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యూరప్ దేశాల్లో ప్రయాణించే అమెరికన్లు, ఔట్ డోర్ మార్కెట్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. ఇరాక్, సిరియాల్లో ఉగ్రవాదులను రూపుమాపి, రఖ్ఖా, మౌసుల్ నగరాలను అధీనంలోకి తీసుకున్నా, ఉగ్రవాదుల నుంచి ముప్పు తప్పినట్టు భావించడం లేదని ఇస్లామిక్ స్టేట్ పై పోరాడుతున్న అమెరికా సంకీర్ణ కూటమి ప్రతినిధి కల్నల్ జాన్ డోరియన్ వ్యాఖ్యానించారు.