: ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంలో నాకన్నా నా కూతురు, కొడుకే బెటర్.. కేటీఆర్
ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడంలో తనకంటే తన కూతురు, కొడుకే బెటర్ అని ఐటీమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 2.0 సదస్సును మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఇప్పటి నుంచే సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం పిల్లలు సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఎంతో ముందున్నారని కొనియాడారు. తన కూతురు, కొడుకు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను తనకంటే ఉత్తమంగా వినియోగిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి ఆన్‌లైన్ సంస్థలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. దేశం క్రమంగా నగదు రహిత లావాదేవీలవైపు మళ్లుతోందని మంత్రి పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వం ఒంటరిగా ఏమీ చేయలేదని, ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వంతో చేయి కలపాలని కేంద్రప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ అజయ్ కుమార్ అన్నారు.