: మూడేళ్లలో 3 లక్షమంది సైబర్ యోధులు.. ఐటీ మంత్రి కేటీఆర్
సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ యోధుల(వారియర్స్)ను సిద్ధం చేస్తున్నట్టు తెలంగాణ ఐటీశాఖా మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అంటే తొలుత గుర్తొచ్చేవి ఇరానీ చాయ్, చార్మినార్, టీ హబ్ అని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ సెక్యూరిటీ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్టు చెప్పారు. సెక్యూరిటీ సమస్యలపై పనిచేయడం ద్వారా భారత్‌కు మంచి అవకాశాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సైబర్ సెక్యూరిటీ పాలసీని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణయేనని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో మూడు లక్షల మంది నిపుణులను తయారుచేస్తామన్నారు. సైబర్ నిపుణులకు కూడా తెలంగాణ హబ్‌గా మారుతుందని మంత్రి జోస్యం చెప్పారు.