: సల్మాన్ కి మళ్లీ జోడీ కుదిరిందా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ రొమేనియన్ ప్రియురాలు లులియా వంతూర్ తో విడిపోయినట్టేనని బీటౌన్ నిర్ధారించింది. అంతే కాదు సల్లూభాయ్ మరో గర్ల్ ఫ్రెండ్ ను కూడా చూసుకున్నాడని భోగట్టా. ఈ మేరకు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ రోబో 2.0 ఆడియో వేడుకకు హాజరయ్యాడు. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్రిటిష్ నటి అయిన అమీ జాక్సన్ తో సల్లూభాయ్ ప్రేమలో ఉన్నాడని, అందుకే ఈ సినిమా ఆడియో వేడుకకు పిలవకపోయినా హాజరయ్యాడని చెబుతున్నారు. ఈ ఆడియో వేడుకకు హాజరైన సందర్భంగా సల్మాన్ చెబుతూ 'రజనీ సార్ ను కలుసుకునేందుకు పిలవకపోయినా వచ్చా'నని సల్మాన్ అన్నాడు. సల్మాన్ తో అమీ త్వరలో నటించనుందంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సోమీ అలీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లులియా వంతూర్ లతో సీరియస్ రిలేషన్ నడిపి, బ్రేకప్ చేసుకున్న సల్మాన్ ఈ ప్రేమనైనా పరిపూర్ణం చేస్తాడేమో చూడాలి. కాగా, అమీ జాక్సన్ బాలీవుడ్ బ్రిటిష్ నటుడు ఉపేన్ పటేల్ తో ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ డిన్నర్లు చేస్తూ పలుమార్లు మీడియా కంటబడ్డారు.