: పెద్దనోట్ల రద్దు అంశంపై మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన బీహార్ సీఎం నితీశ్
నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మరోసారి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కొనియాడారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంటే నితీశ్‌కుమార్ మాత్రం మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయంపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జేడీయూ నేతల సమావేశంలో పెద్దనోట్ల రద్దుపై స్పందించిన నితీశ్ మాట్లాడుతూ.. మోదీ పులి మీద స్వారీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు విషయం మోదీ మిత్రులను కూడా దెబ్బతీసేలా ఉందని, ప్రజలు మాత్రం ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు అంశాన్ని తమ పార్టీ నేతలు గౌరవించాలని ఆయన సూచించారు.