: యూపీలో ఘోర రైలు ప్రమాదం.. 45 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో ఈ తెల్లవారుజామున మూడు గంటలకు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ దేహత్ జిల్లా ఫుఖ్రాయిన్ దగ్గర పాట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ లోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అధునాతన యంత్రాలను ఉపయోగించి సహాయక చర్యలు ప్రారంభించాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షిస్తున్నాయి. మరోవైపు యూపీ ప్రభుత్వ వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది.