: ఫుడ్ పార్కులోకి వెళ్లి దాడులు చేస్తే...కేసులు పెట్టరా?...పవన్ కల్యాణ్ కు లేఖ రాస్తా: గోకరాజు గంగరాజు
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాస్తానని బీజేపీ నేత, ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ, భీమవరం పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ లోపలికి వెళ్లి దాడులు చేస్తే కేసులు పెట్టరా? అని అడిగారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఫుడ్ పార్క్ లోని వ్యర్థాలు యనమదుర్రు డ్రెయిన్ లోకి వదులుతామని, అక్కడి నుంచి అవి సముద్రంలో కలుస్తాయని ఆయన చెప్పారు. వ్యర్థాలు గోదావరిలో కలవవని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ పవన్ కల్యాణ్ ను ఆ ప్రాంత రైతులు కలిసిన సంగతి, ఆయన వారికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.