: బ్యాంకుల్లో తగ్గిన క్యూలు... ఏటీఎంల వద్ద కొనసాగుతున్న రద్దీ


నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన 11 రోజుల తరువాత నేడు, బ్యాంకుల్లో ఖాతాదారుల క్యూలైన్లు కాస్తంత తగ్గాయి. ఇదే సమయంలో ఏటీఎం మెషీన్ల వద్ద మాత్రం రద్దీ కొనసాగుతోంది. చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేడు కేవలం తమ శాఖకు సంబంధించిన ఖాతాదారులకు మాత్రమే సేవలందిస్తామని బ్యాంకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల కస్టమర్లకు నోట్ల మార్పిడి ఉండదని ప్రకటించడంతోనే బ్యాంకుల ముందు క్యూ లైన్లు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం ప్రకటించారు. బ్యాంకుల వద్ద రద్దీ తగ్గిందని, వాస్తవానికి ప్రజల్లోని ఆందోళన కారణంగానే ఇన్ని రోజులూ క్యూలైన్లు పెద్దగా కనిపించాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో 10 నుంచి 20 మంది మాత్రమే కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటికీ చిల్లర కష్టాలు ప్రజలను వీడలేదు. పాలు, కూరగాయలు, అత్యవసర ఔషధాలు కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో పాత నోట్లు స్వీకరించక, కొత్త నోట్లు లేక రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్, ఇసుక వంటి నిర్మాణ రంగానికి అవసరమైన ప్రొడక్టుల సరఫరా నిలిచిపోయింది. దీంతో రోజువారీ కూలీలకు పని లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News