: శివాలయం తలుపులకు నిజమైన నాగబంధం.. వెయ్యేళ్లనాటి ఏకాంబరేశ్వర ఆలయంలో ఘటన
ఇదో రియల్ నాగబంధం. తమిళనాడు తిరువణ్నామలై జిల్లా కన్నమంగళం సమీపంలో చోటుచేసుకుంది. కొళత్తూరులో వెయ్యేళ్లనాటి పురాతన ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, పార్వతీపరమేశ్వరుల ఆలయాలున్నాయి. భక్తులతో ఆలయం రోజూ కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. కార్తీకమాసం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సుబ్రహ్మణ్యస్వామి, శివపార్వతులకు రోజూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం ఆలయానికి వచ్చిన పూజారి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆలయ గేటుకు పెనవేసుకున్న పామును చూసి ఖిన్నుడయ్యాడు. ఆలయ తలుపునకు నాగబంధంలా పెనవేసుకున్న పామును చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలిసిన స్థానికులు దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలయానికి చేరుకుని పామును పట్టుకున్నారు. దానిని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. కార్తీక మాసంలో శివాలయం తలుపులకు పాము చుట్టుకోవడం శుభసూచకమని ప్రజలు చెబుతున్నారు.