: ఐసిస్ చీఫ్ నిద్రపోయే సమయంలో కూడా మానవబాంబును పక్కన పెట్టడట!
ఐసిస్ చీఫ్ నిద్రపోయే సమయంలో కూడా తాను ధరించిన మానవబాంబును పక్కన పెట్టడని ఒక మీడియా సంస్థ పేర్కొంది. ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని ఇరాక్, కుర్దిష్, అమెరికన్ దళాలు చుట్టుముట్టినప్పటికీ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ పట్టుబడకపోవడానికి గల కారణాలను ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాక్, కుర్దిష్, అమెరికన్ దళాల కదలికలను ఎప్పటికప్పుడు తన నమ్మిన బంట్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటున్న బాగ్దాదీ తెలుసుకుంటున్నాడని, ఒకవేళ, సైన్యానికి పట్టుబడే పరిస్థితులు వస్తే, అక్కడికక్కడే ఆత్మాహుతికి పాల్పడేందుకు వీలుగా మానవబాంబును బాగ్దాదీ ధరించాడని ఈ మీడియా సంస్థ పేర్కొంది. చివరకు, బాగ్దాదీ నిద్రపోయే సమయంలో కూడా మానవబాంబును పక్కన పెట్టడం లేదని, దానిని ధరించే నిద్రపోతున్నాడని పేర్కొంది. అంతేకాకుండా, తన అనుచరులతో నవ్వుతూ మాట్లాడే బాగ్దాదీ తీరులో మార్పు వచ్చిందని.. అనుమానం వస్తే కనుక, ఎంత నమ్మిన బంటును అయినా సరే దారుణంగా చంపిస్తున్నాడని తెలిపింది.