: సిగరెట్‌, మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ విక్టరీ వెంకటేశ్ వీడియో సందేశం

యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న పిల్లలు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌లు కాకుండా వాటికి దూరంగా ఉండాలంటూ ఓ టీనేజ్‌ ఫౌండేషన్ తో క‌లిసి తెలుగు సినీన‌టుడు విక్ట‌రీ వెంకటేశ్ ఓ వీడియో సందేశాన్ని రూపొందించి విడుద‌ల చేశారు. ‘పీర్‌ ప్రెషర్‌’కు వ్యతిరేకంగా ఆయన ఈ వీడియో ప్ర‌చారంలో పాల్గొంటూ సామాజిక స్పృహను చాటుకున్నారు. అమ్మానాన్న‌ల వెనుక తిరుగుతూ అప్ప‌టివ‌ర‌కు అమాయ‌కుల్లా క‌నిపించే పిల్లల్లో యుక్త వ‌య‌సులోకి రాగానే కొన్ని మార్పులు క‌న‌ప‌డ‌డం సాధార‌ణం. వారు త‌ప్ప‌ట‌డుగులు వేసే దిశ‌గా ఆ వ‌య‌సులోనే తోటి పిల్ల‌ల ప్ర‌భావానికి లోన‌వుతుంటారు. త‌మ స్నేహితులంతా క‌లిసి ఒక్క‌చోట చేరి పార్టీలు చేసుకుంటున్న స‌మ‌యంలో, లేదా సినిమాకి వెళ్లిన సంద‌ర్భంలో, మైదానంలో ఆట‌లు ఆడుకుంటున్న స‌మ‌యంలో తోటి పిల్ల‌లు చెడు అల‌వాట్ల‌వైపుగా ప్రోత్స‌హిస్తూ సిగ‌రేట్‌, గుట్కా, మ‌ద్య‌పానం, డ్ర‌గ్స్ వంటి అల‌వాట్లు చేస్తుంటారు. ఇటువంటి ప్ర‌మాద‌క‌ర చెడు అలవాట్లన్నిటినీ చాలామంది స్నేహితుల ఒత్తిడి వల్ల అల‌వాటు చేసుకుంటారు. పిల్ల‌ల‌పై ప‌డే ఇలాంటి ఒత్తిడినే ‘పీర్‌ ప్రెషర్‌’అంటారు. దీనిపైనే వెంక‌టేశ్ వీడియో విడుద‌ల చేశారు. స్నేహితులు త‌మ‌ను ఒత్తిళ్లకు గురిచేస్తున్న‌ప్పుడు నిర్మొహ‌మాటంగా ‘నో’ చెప్పాల‌ని వెంక‌టేశ్ చెప్పారు. 'మిమ్మ‌ల్ని బ‌ల‌వంత పెట్టేది స్నేహితులైనా, మరెవరైనా స‌రే మీ ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి' అని వీడియోలో అన్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పిల్ల‌లు త‌మ‌కు నచ్చకపోయినా వారి చుట్టూ ఉన్నవారి ఒత్తిడి వల్ల అటువంటి అల‌వాట్ల‌ వైపు ప్రేరేపితులవుతున్నార‌ని పలువురు చెప్పగా తాను విన్నానని పేర్కొన్నారు. అటువంటి విష‌యాల‌కు ప్ర‌భావితం కాకుండా వారిలో చైతన్యం కలిగించేందుకే ఈ ప్ర‌య‌త్నంలో పాల్గొన్నాన‌ని చెప్పారు. డాక్టర్‌ లలిత ఆనంద్ స‌మక్షంలో ఈ వీడియోకు రచన, దర్శకత్వ బాధ్య‌త‌లు జెన్నిఫర్‌ అల్ఫోన్స్ వ‌హించారు.

More Telugu News