: నేడే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం...ఇరుకున పెడతారా? పడతారా?


పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. అధికార పక్షంపై నిప్పులు కురిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతుండగా, వారికి దీటైన సమాధానం చెప్పేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు, యురీ ఉగ్రదాడి, కశ్మీర్ సంక్షోభం వంటి ప్రధాన అంశాలపై ఈసారి పార్లమెంటులో చర్చ జరగనుంది. యురీ ఉగ్రదాడి ఘటనపై అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా చర్చ జరగనుందని అంతా భావిస్తున్న దశలో, జాతి విస్తృత ప్రయోజనాలరీత్యా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది దేశంలోని కొన్ని వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తుండగా, విపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విపక్షాల అభ్యంతరాలపై నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసురుతున్నా, పార్లమెంటు సాక్షిగా ఈ విషయంపై చర్చకు సిధ్ధపడింది. దీంతో ప్రధాని అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ, ‘మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. చర్చించండి. వాదించండి. కానీ సమావేశాలను సజావుగా సాగనివ్వండ’ని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు, జమ్మూ–కశ్మీర్‌ లో చల్లారని అల్లర్లు, జేఎన్‌యూలో విద్యార్థి మాయమై రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడం, ఢిల్లీలో పని చేస్తున్న ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు ఛత్తీస్‌ గఢ్‌ అడవుల్లో జరిగిన ఒక హత్యలో ప్రమేయం ఉందంటూ నోటీసులు జారీకావడం.. వంటి సమస్యలు అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ అంశాల్లో పైచేయి సాధించేందుకు అధికార, విపక్షాలు ఎత్తులు పైఎత్తులు, అస్త్రశస్త్రాలతో సిద్ధమవుయ్యాయి. దీంతో నేడు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి.

  • Loading...

More Telugu News