: నోట్ల ఎఫెక్ట్... దేవుడి హుండీలో రూ. 44 లక్షల పాత నోట్లు
పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని ఆ పురాతన ఆలయానికి ఏకంగా రూ. 44 లక్షల విరాళం వచ్చింది. గుర్తు తెలియని భక్తులు దేవాలయం హుండీలో ఇంత భారీ మొత్తంలో డబ్బును వేశారు. ఇవన్నీ పాత రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలే. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని వెల్లోర్ లో పురాతన జలకందేశ్వరన్ ఆలయం ఉంది. దీన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయానికి చిన్న చిన్న కానుకలు తప్ప భారీ విరాళాలు ఏనాడూ వచ్చింది లేదు. దాంతో పూజలు, ప్రత్యేక అర్చనల ద్వారానే అంతో ఇంతో ఆదాయం సమకూరేది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రూ. 44 లక్షల విరాళం వచ్చిపడింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, ఒక భక్తుడు కానీ, లేక కొంత మంది కలిసి గానీ ఈ డబ్బును వేసి ఉండవచ్చని తెలిపారు. ఇంత మొత్తంలో ఆలయానికి విరాళం రావడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. ఈ శివాలయం గతంలో వివాదంలో ఉండేది. 1981లో సమస్య పరిష్కారం అయింది. ప్రస్తుతం ఈ ఆలయ సంరక్షణను ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చూస్తోంది.