: వివాహానికి ముందు బ్యాంక్‌కు పరిగెత్తి క్యూలో నిలబడిన పెళ్లికొడుకు
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లోని ఓ బ్యాంకులో తమ డబ్బు డిపాజిట్ చేసుకోవడానికి, మార్పిడి చేసుకోవడానికి క్యూలో నిలబడిన ప్రజలకు ఓ విచిత్రమైన సన్నివేశం కనిపించింది. కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ పెళ్లి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తమతో పాటు క్యూలో నిలబడడాన్ని చూసిన వారు షాకయ్యారు. తాను ఓ ఆటో డ్రైవర్ నని, తన పెళ్లి జరగాల్సి ఉండడంతో కేటరింగ్‌కు డబ్బు ఇవ్వాల్సి ఉందని షోయబ్ పేర్కొన్నాడు. తన వద్ద సమయానికి డబ్బు అందుబాటులో లేకపోవడంతో బ్యాంక్‌కు వచ్చినట్లు పేర్కొన్నాడు. సుమారు నాలుగు గంటల పాటు క్యూలో నిలబడి, డబ్బు తీసుకున్నట్లు తెలిపాడు. తన పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని ఆయన చెప్పాడు. ఏమైనా, తనకు డబ్బు అందిందని, లేకపోతే తన వివాహం వాయిదా వేయాల్సి వచ్చేదని చెప్పాడు.