: భారత్ కు అణుశక్తి పరిజ్ఞానం ఇవ్వనున్న జపాన్!
మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, అత్యంత కీలకమైన అణుశక్తి ఒప్పందాన్ని జపాన్ తో కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే భారత్ కు అణు పరిజ్ఞానాన్ని అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన జపాన్, నేడు డీల్ కుదుర్చుకోవచ్చని సమాచారం. దీంతో అణు రియాక్టర్లు, ఇంధనం, సంబంధిత టెక్నాలజీ భారత్ కు జపాన్ సరఫరా చేస్తుంది. నేడు జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమైన వేళ, ఈ చరిత్రాత్మక డీల్ కుదురుతుందని తెలుస్తోంది. కాగా, ఇండియాకు అణు పరిజ్ఞానాన్ని అందించే విషయమై జపాన్ గడచిన ఆరేళ్లుగా చర్చిస్తూనే ఉంది. ఈ రీజియన్ లో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, దాన్ని వ్యతిరేకిస్తున్న జపాన్ ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు ఈ డీల్ ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. భారత్ సైతం జపాన్ కు మిత్రదేశంగా మెలగుతూ, చైనాను అడ్డుకోవాలని ఎత్తులు వేస్తున్న నేపథ్యంలో ఈ డీల్ పై నేడు మరింత స్పష్టత రానుందని సమాచారం. కాగా, భారత్ లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలకు, అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. 'మేకిన్ ఇండియా మరియు మేడ్ బై జపాన్' నినాదాలతో ఇరు దేశాలూ ముందుకు సాగాలని ప్రధాని అభివర్ణించారు.