: చైనా మరో ఘనత... అత్యంత ఎత్తులో సొరంగం నిర్మాణం
ప్రపంచంలో బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా... ప్రతి విషయంలోనూ తానే టాప్ గా ఉండాలని భావిస్తోంది. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సొరంగ మార్గాన్ని నిర్మించింది. సిషువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డును టిబెట్ లోని నాగ్ కుతో కలిపే మార్గంలో ఈ సొరంగాన్ని వేసింది. షోల పర్వత ప్రధాన శిఖరాన్ని తొలిచి ఈ మార్గాన్ని నిర్మించింది. ఈ సొరంగం సముద్ర మట్టానికి 6,168 మీటర్ల ఎత్తులో 7 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇప్పటిదాకా ప్రయాణికులు పర్వత రహదారుల మీదుగా 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. విపరీతమైన చలి, కొండచరియలు విరిగి పడటం, తక్కువ ఆక్సిజన్ ఉండటంలాంటి ఇబ్బందులను వారు ఎదుర్కొనేవారు. ఈ కొత్త సొరంగ మార్గంతో వారి ప్రయాణ సమయం ఇప్పుడు 2 గంటలు తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టును 2012లో మొదలు పెట్టిన చైనా... రూ. 1,139 కోట్ల వ్యయంతో సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ మార్గంలో వాహనాలను అనుమతించనున్నారు.