: వేడి వేడి సూప్‌ను తీసుకొచ్చి మహిళ ముఖంపై పోసిన హోటల్ వెయిటర్!
కుమార్తెతో కలిసి డిన్నర్ చేద్దామని హోటల్‌కి వెళ్లిన ఓ మహిళకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అంతేగాక, ఆమె తీవ్రగాయాల పాలైంది. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పునిస్తూ మహిళపై దాడి చేసిన 17 ఏళ్ల హోటల్ వెయిటర్ కు శిక్షవిధించింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ చైనాలోని వెంజ్‌వుకు చెందిన లిన్ అనే మహిళ కుటుబం గత సంవత్సరం ఆగస్టులో అక్కడి ‘మిస్టర్ హాట్ పాట్’ హోటల్‌లో భోజనం చేస్తుండగా వెయిటర్ జూతో గొడవపెట్టుకుంది. తాగునీరు సరిగా లేదని వెయిటర్ ను ఆమె అడగగా ఆమెకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో లిన్ హోటల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెగిటివ్‌గా రివ్యూ పోస్ట్ చేసింది. ఆ దేశంలో కస్టమర్ల రివ్యూలను చూసే కొత్త కస్టమర్లు వస్తుంటారు. ఆమె పోస్ట్ చేసిన రివ్యూని చూసిన వెయిటర్ జూ అలా ఎందుకు చేశావంటూ మరోసారి ఆమెతో గొడవ పడి, పోస్టు తీసేయాలని అన్నాడు. అందుకు లిన్ ససేమిరా అనడంతో ఆవేశంతో ఊగిపోయి వంటగదిలో సిద్ధంగా ఉన్న వేడి వేడి సూప్‌ను తీసుకొచ్చి ఆమెపై పోశాడు. అయినప్పటికీ కోపం తగ్గించుకోని వెయిటర్ ఆమెను చితక్కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ ఆ హోటల్ సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఆ మహిళపై జు చేస్తోన్న దాడి ఆపేలా చేయడానికి అక్కడి ఐదురుగు వ్యక్తులు ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ దాడితో ఆమె ముఖం, మెడభాగం, భుజాలు, చర్మం బాగా కాలిపోయి ఆసుపత్రి పాలయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వెయిటర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. న్యాయస్థానం ఆ వెయిటర్‌కి 22 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.ఈ దాడికి సదరు హోటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పింది. గాయపడ్డ మహిళక ఆసుపత్రి చికిత్స నిమిత్తం 5,77,000 యెన్‌లు హోటల్ నుంచి ఇప్పించేలా ఆదేశించాలని లిన్ కోరింది. అయితే, ఆమె వైద్యానికి హోటల్ ఇప్పటికే ఖర్చులు చేసిందని, 2,37,000 (35000డాలర్లు) మాత్రమే చెల్లించాలని హోటల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.