: ఇక్కడ భూమి ఉండి కూడా కేవలం నీరులేక ఆత్మగౌరవాన్ని అమ్ముకొని బతుకుతున్నారు!: పవన్ కల్యాణ్
అనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న కరవు పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీమాంధ్రహక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... ‘కరవు వల్ల ఆంధ్రపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు, మీకు తెలుసా?' అని ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరులేక ఆత్మగౌరవం అమ్ముకొని బతుకుతున్నారు. మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరని వారు ఆవేదన చెందుతున్నారు’ అని పవన్ అన్నారు. దోపిడీ, మోసాలు ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. ‘నేనూ రైతునే.. కూలి పని కూడా తెలుసు ... ప్రభుత్వాలు తలుచుకుంటే అనంతపురాన్ని బాగు చేయగలవు. సత్యసాయిబాబా చేసిన పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయవు? స‌్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయగలగడం లేదు? ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉంది. నాకు నటుడిగా ఆనందం లేదు. నాకు నిజమైన ఆనందం కలిగేది ప్రజల సమస్యలపై పోరాడినప్పుడే. మీకు నేను అండగా ఉంటాను. మీ సమస్యలే నా సమస్యలు. నా మొదటి జనసేన కార్యాలయం అనంతపురంలోనే ప్రారంభిస్తానని మరోసారి చెబుతున్నాను. ఇంతకు ముందు ఇక్కడికి ఎవరు వచ్చారో, ఏం చేశారో నాకు తెలియదు. కానీ మీ వాడిగా ఇక్కడి కరవును నిర్మూలించేందుకు పని చేస్తా’ అని పవన్ కల్యాణ్ అన్నారు.