: 'అహో ఆంధ్ర భోజా.. ఓహో ఆంధ్ర భోజా' అంటూ భజన చేస్తున్నారు: పవన్ కల్యాణ్
ప్రభుత్వాల మూలాలు, పునాదులు ప్రజల దగ్గరే ఉన్నాయని, వారిని ఎన్నుకునేది ప్రజలేనని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులు ప్రజలకు అండగా నిలబడకపోతే ఆ వ్యవస్థను కూల్చేస్తామని చెప్పారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీమాంధ్రహక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఒక్కోలెక్క చెప్పారని.. ఒకరు 2 లక్షల 25 వేల కోట్లంటే, మరొకరు 2 లక్షల మూడు వేల కోట్లని మరో లెక్కచెప్పారని, వారి మాటల మధ్యే అంత వ్యత్యాసం ఉందని అన్నారు. ‘రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టారో... చీకటి గదుల్లో రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేశారో ఇప్పుడు కూడా ప్రత్యేక హోదాపై అదే పరిస్థితి తీసుకొచ్చారు.. హోదాకి చట్ట బద్ధత కావాలి. కేంద్ర ఆర్థిక సంఘం 1 లక్ష 75 వేల కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తుంది... స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయిన మనకు రావాల్సిన ప్యాకేజీ ఇది. ఇంటి వాడికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసిన 'ఆహా ఆంధ్ర భోజా.. ఓహో ఆంధ్ర భోజా' అంటూ సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్రం గురించి మాట్లాడాలంటే మోదీపై నాకు ఎంతో గౌరవం ఉంది.. అలాగని రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోను’ అని పవన్ అన్నారు. ‘2 లక్షల 25 వేల కోట్ల రూపాయలు ఇస్తామంటూ మీరు ఏ ప్రాతిపదికన చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ క్రీడ ఆడుతున్నారంతే.... అడిగినా అడగకపోయినా రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీనే మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇస్తున్నారు. అంకెల గారడి తప్పా ఇంకేం లేదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.