: బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు చేస్తే చట్టప్రకారం పరిణామాలు ఉంటాయి: అరుణ్‌జైట్లీ
గతంలో ఆదాయాన్ని వెల్లడించని వారు ఇప్పుడు బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు చేస్తే చట్టప్రకారం పరిణామాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సామాన్యులు స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకి కొంత మొత్తంలోనే డబ్బు అందుతుండడంతో వారు కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కుంటుండవచ్చని అన్నారు. చిన్న మొత్తంలో ప్రజలు చేసుకునే డబ్బు డిపాజిట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకొని, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఆర్‌బీఐతో పాటు, దేశంలోని బ్యాంకులు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయని చెప్పారు. వారాంతాల్లో కూడా బ్యాంకుల సేవలు ప్రజలకి అందుతాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దును తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించిన వారే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి భయపడుతున్నారని, కొత్త నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించేటప్పుడు జీఎస్టీ సవరణ బిల్లును కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యాపారాలు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జైట్లీ అన్నారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అందరి నిర్ణయాలు తీసుకొని ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నామని అన్నారు. గత ప్రభుత్వాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో ప్రజలు ఈరోజు నుంచి నోట్ల మార్పిడి, డిపాజిట్లు చేస్తున్నారని అన్నారు.