: "నువ్వు మా అధ్యక్షుడివి కాదు" భగ్గుమంటున్న అమెరికన్లు... వీధుల్లో జోరందుకున్న నిరసనలు
ఎక్కువ మంది అమెరికన్లు కోరుకున్న హిల్లరీ క్లింటన్ కాకుండా, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కానుండటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాలైన న్యూయార్క్, చికాగో, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ ట్రంప్ వ్యతిరేక ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఓక్లాండ్ లోని డౌన్ టౌన్ ప్రాంతంలో ట్రంప్ చిత్ర పటాలను దగ్ధం చేశారు. ఓరెగాన్ లో వందలాది మంది ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. పోర్ట్ ల్యాండ్ లో రైళ్ల రోకో నిర్వహించారు. 'దట్స్ నాట్ మై ప్రెసిడెంట్', 'ఏ రేపిస్ట్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్', 'వీ డునాట్ కన్సెంట్', 'నాట్ మై ప్రెసిడెంట్' అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు. సియాటెల్ లో 100 మందికి పైగా నిరసన కారులు రాస్తారోకో నిర్వహించారు. పెన్సిల్వేనియాలోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ విద్యార్థులు వీధుల్లో ర్యాలీ నిర్వహించి, ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. క్యాంపస్ లో నిరసనలు పెరగడంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్విట్టర్ లో 'నాట్ మై ప్రెసిడెంట్' పేరిట హాష్ ట్యాగ్ ఏర్పాటు చేయగా, దాదాపు 5 లక్షల మంది దాన్ని లైక్ చేశారు.