: శభాష్.. కీపిట్ అప్!: తెలంగాణ పోలీసులకు గవర్నర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో 21 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అత్యాధునిక పోలీస్‌స్టేషన్, తరగతి గదులు, క్రీడా ప్రాంగణానికి ఈ రోజు గవర్నర్ చేతుల మీదుగా భూమిపూజ, శంకుస్థాపన జరిగాయి. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. ప్రజామిత్ర పోలీసింగ్ ద్వారా పోలీసు వ్యవస్థ ప్రజలకి అందించే సేవల్లో అనేక మంచి మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు లభించిందని, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత రెండున్నర సంవవత్సరాలుగా తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసిచారు. విధి నిర్వహణలో పోలీసులు తమకు ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని నరసింహన్ పోలీసులకి సూచించారు. కానిస్టేబుళ్లు ప్రజలతో వ్యవహరించే తీరుతోనే పోలీసుల ప్రవర్తన అర్థమవుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బంది పట్ల పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పనితీరు బాగుందని ఆయన అన్నారు.