: యూఎస్ హౌస్‌కు ప్రమీల జయపాల్ ఎంపిక.. మరోవైపు ఇండో అమెరికన్ పీటర్ జాకోబ్ ఓటమి
వాషింగ్టన్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనెటర్ పదవికి పోటీచేసిన భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్ విజయం సాధించారు. అమెరికా కాంగ్రెస్‌లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎన్నికయ్యారు. సభలో ఆమె జిమ్ మెక్‌డెర్మాట్ స్థానంలో త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. సభలో 37ఏళ్లు పనిచేసిన జిమ్ మెక్‌డెర్మాట్ రిటైర్ కానున్నారు. జయపాల్ తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. ఆమెకు అయిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఇండోనేషియాకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి సింగపూర్, ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. 1995లో భారత్‌కు వచ్చిన ఆమె ఇక్కడ కొన్నాళ్లు గడిపి తిరిగి అమెరికా వెళ్లారు. ఆమెను శ్వేతసౌధం 2012లో ‘ఛాంపియన్ ఆఫ్ ఛేంజ్’ అవార్డుతో సత్కరించింది. తమ ప్రాంతంలో వలసదారుల కోసం చేసిన కృషికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. తాను గెలుపొందితే పలు కార్యక్రమాలు చేపడతానని జయపాల్ గతంలో పలు హామీలు ఇచ్చారు. వాటిల్లో ట్యూషన్ ఫీజు లేని కమ్యూనిటీ కాలేజీ, తుపాకుల హింస నుంచి రక్షణ, ప్రాథమిక విద్యకు నిధులు హామీలు ముఖ్యమైనవి. ఆమె రచించిన పుస్తకం పిల్‌గ్రిమేజ్ టు భారత్: ఎ వుమన్ రివిజిట్స్ హర్ హోమ్‌ల్యాండ్ పేరుతో వెలువడింది. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కోసం ఎన్నికల బరిలో నిలిచి పోరాడిన మరో ఇండో అమెరికన్ పీటర్ జాకోబ్ పరాజయం పొందారు. ఆయన కేరళకు చెందిన వ్యక్తి. ఆయన కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫున పీటర్ న్యూజెర్సీ నుంచి పోటీ చేశారు. సామాజిక కార్యకర్త అయిన 15 శాతం ఓట్ల తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి లియోనార్డ్ లాన్స్‌పై పరాజయం పొందారు.