: ఈ తెల్లగుర్రం తన ప్రాణమంటున్న యజమాని!
దేశ వ్యాప్తంగా జరిగిన పలు పోటీల్లో పాల్గొని, ఇప్పటివరకు 15 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ‘సుల్తాన్’ అనే తెల్లగుర్రం తన ప్రాణమని దాని యజమాని గుర్వీందర్ సింగ్ అన్నాడు. ఈ గుర్రాన్ని రూ.51 లక్షలకు తమకు అమ్మాలని దాని యజమాని వద్దకు కొందరు వ్యక్తులు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు. హర్యానాలోని కర్నల్ జిల్లాలోని డబ్రీ గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్ ఈ జాతి గుర్రాన్ని తన సొంత కొడుకులా భావిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా గుర్వీందర్ మాట్లాడుతూ, నుక్రా జాతికి చెందిన ఈ తెల్లగుర్రం 2012లో పానిపట్ లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీల్లో విజేతగా నిలిచిందన్నారు. తమ జిల్లా సహా ఎక్కడ గుర్రపు పందేలు జరిగినా ‘సుల్తాన్’దే విజయమని, దీని సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించానని చెప్పారు. ‘సుల్తాన్’ కు ప్రతి నెలా అయ్యే ఖర్చు లక్ష రూపాయలు అని పేర్కొన్నారు. రోజువారీ ఆహారంతోపాటు 5 లీటర్ల ఆవు పాలు, 100 గ్రాముల నెయ్యి దీనికి నిత్యం ఆహారంగా అందిస్తామన్నారు. ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచిన ‘సుల్తాన్’ని అంతర్జాతీయ పోటీల్లో ప్రవేశపెట్టేందుకు చూస్తున్నానని గుర్వీందర్ చెప్పారు.