: ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా దూరం?.. కుదుటపడని ఆరోగ్యమే కారణం
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోవడంతో ఇంట్లో నుంచే పనులు చక్కబెట్టుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సోనియాకు సూచించినట్టు సమాచారం. ఆగస్టులో వారణాసిలో పర్యటిస్తున్నప్పుడు అస్వస్థతకు గురైన సోనియా ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేదు. కేన్సర్ నుంచి ఆమె త్వరగానే బయటపడినా, గత మూడునాలుగు నెలలుగా ఆరోగ్యం అంత బాగోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాలేకపోయారని చెబుతున్నారు. తీవ్ర గొంతునొప్పి, దగ్గుతో బాధపడుతున్న సోనియా కారులో కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆమె రాలేకపోయారు. కాగా అనారోగ్యం కారణంగా ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే తనయుడు రాహుల్ గాంధీకి వీలైనంత త్వరగా పార్టీ పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నారు. ఇంటి వద్ద ఉంటూనే రాహుల్‌కు దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నట్టు సీినియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.