: తొలిసారి యూరప్ ను వదిలిన బ్రిటన్ ప్రధాని... థెరిస్సా మేకు ఘనస్వాగతం పలికిన భారత్
గడచిన జూలైలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత థెరిస్సా మే యూరప్ ను వదిలి, ద్వైపాక్షిక చర్చల నిమిత్తం ఇండియాలో కాలుమోపగా, ఆమెకు దౌత్యాధికారులు, ప్రొటోకాల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. భారత్, యూకేల మధ్య మరింత స్నేహ, వ్యాపార బంధాలే లక్ష్యంగా థెరిస్సా పర్యటన సాగనుండగా, ఢిల్లీలో జరిగే టెక్ సమ్మిట్ లో యూకేకు చెందిన 40కి పైగా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. కాగా, థెరిస్సామే నేడు ప్రధానితో సమావేశమై పలు కీలకాంశాలను చర్చించనున్నారు. నేటి మధ్యాహ్నం థెరిస్సా గౌరవార్థం ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆమె హాజరు కానున్నారు. బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలు సహా పలు అంశాలపై చర్చలు, ఒప్పందాలు కుదురనున్నాయని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు శైలేష్ ఓరా వెల్లడించారు. రెండు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు సాగనున్నాయని తెలుస్తోంది. నేడు ఢిల్లీలో ఉండే థెరిస్సా మే, మంగళవారం నాడు బెంగళూరుకు వెళ్లి అక్కడి ఉత్పత్తి కేంద్రాలను సందర్శించనున్నారు. ఆపై లండన్ కు తిరిగి పయనమవుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆమె సమావేశమవుతారని తెలుస్తోంది.