: నాకు మూడు బాధ్యతలున్నాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు
తనకు మూడు బాధ్యతలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటి ప్రజల సంక్షేమానికి పాటుపడడం, రెండవది కుటుంబ పెద్దలా పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదుకోవడం, మూడవది తన వ్యక్తిగత కుటుంబం అని చెప్పారు. ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదని అన్నారు. తన కుటుంబ బాధ్యతల్లో భాగంగా హెరిటేజ్ కంపెనీ పెట్టుకున్నట్లు, ఆ కంపెనీ నీతినిజాయతీలతో పనిచేస్తోందని చెప్పారు. అందరూ నీతినిజాయతీలతో పనిచేయాలని, ప్రలోభాలకు లోనుకాకూడదని చెప్పారు. 'శభాష్ తెలుగు దేశం పార్టీ' అని అందరు చెప్పుకునేలా పార్టీని నడిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, వైసీపీలు రెండు కుమ్మక్కయ్యాయని చంద్రబాబు నాయుడు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. కార్యకర్తలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. పేదవారు పిల్లల్ని చదివించుకోలేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింత దగ్గరకావాలని చెప్పారు. పని మొదలు పెట్టిన తరువాత దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. సక్రమంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి అందరూ ఆలోచించుకోవాలని అన్నారు.