: ఆ 'లెక్క'న అక్కడ మీరు ఉచిత వైఫై అందుకుంటారు!
అన్ని ప్రముఖ ప్రదేశాల్లో కస్టమర్ల సదుపాయాలలో భాగంగా వై-ఫైను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వై-ఫై సదుపాయం కల్పించడం అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంది. తమ హోటళ్లు, రెస్టారెంట్లలో అమ్మచేతి వంట లాంటి భోజనం ఉంటుందని, కొత్త కొత్త వంటకాలు, పరిశుభ్రత ఉంటాయని ప్రచారం చేసుకునే వాటి యజమానులు ఇప్పుడు వాటితో పాటు ఉచిత వై-ఫై సదుపాయం ఉందని, జెట్ స్పీడ్‌తో పనిచేస్తుందని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ హోటళ్లు, రెస్టారెంట్ల గురించి అధికంగానే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ఈ వై-ఫై సదుపాయాన్ని తమ కస్టమర్లు పొందడానికి కొన్ని హోటళ్లు అందుకోసం పాస్‌వర్డ్ పెట్టుకోకుండా ఉంటే, కొన్ని హోటళ్లవారు నోటీస్ బోర్డుల్లో పాస్‌వర్డ్‌లను రాసి పెడుతుంటారు. కానీ టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్ సెపరేటు రూటులో పాస్ వర్డ్ చెబుతోంది. లెక్కను చేయండి.. పాస్ వర్డ్ కనిపెట్టుకోండి అన్నట్లుగా బోర్డు పెట్టి ఓ క్లిష్టమైన లెక్కను చూపిస్తోంది. ఆ లెక్కకు వచ్చే సమాధానమే వై-ఫై పాస్‌వర్డ్ అని చెబుతోంది. టెక్సాస్‌లోని శాన్ ఆంటొనియోలో ఉన్న యాయాస్ థాయ్ రెస్టారెంట్ యాజమాన్యం ఇలా తమ కస్టమర్ల ముందుకు ఫ్రీ వైఫై అవకాశం తీసుకొచ్చింది. ఏ ఉద్దేశంతో ఇలా పెట్టారో కానీ క్లిష్ట ప్రశ్నకు కస్టమర్లు ఎవరూ కూడా సమాధానం కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఆ లెక్క ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.