: ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న డీడీ చెల్లలేదు.. బ్యాంకులాటలో విద్యార్థినికి దక్కని ‘పురస్కారం’
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ విద్యార్థినికి ప్రోత్సాహకంగా అందించిన చెక్ చెల్లదంటూ బ్యాంకు అధికారులు తిప్పిపంపారు. దీంతో ఆ చెక్‌ను అందుకున్న విద్యార్థిని ఆనందం ఆవిరైంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నామకల్లు ప్రవలిక అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసింది. 2016 సంవత్సరానికి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. అక్టోబరు 13న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రవలిక ప్రతిభా పురస్కారం ప్రశంసాపత్రం, రూ.20వేల డీడీ అందుకుంది. అయితే, ఆ డీడీలో నామకల్లు ప్రవలిక పేరుకు బదులు హారిక అని ఉంది. పేరును సరిచేసే క్రమంలో హైదరాబాద్‌లోని సిండికేట్ బ్యాంకు సిబ్బంది హారిక పేరు కనిపించకుండా దానిపై బ్యాంక్ సీల్ వేశారు. ఈ విషయం తెలియని ప్రవలిక హిందూపురం ఆంధ్రాబ్యాంక్‌లో ఆ డీడీని తన అకౌంట్‌లో జమచేసేందుకు వెళ్లింది. దానిని పరిశీలించిన బ్యాంకు సిబ్బంది డీడీ చెల్లదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ వెళ్లి డీడీ జారీ చేసిన బ్యాంకు సిబ్బందితో మరో సీల్ వేయించుకురావాలని, లేదంటే మరో డీడీ తీసుకురావాలని చెప్పడంతో ప్రవలిక ఆనందం ఆవిరైంది. ఇప్పుడు దీని కోసం హైదరాబాద్ వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో పడింది. ఈ విషయంలో అధికారులు స్పందిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.