: తెలంగాణ ప్రభుత్వంతో మీరు మాట్లాడండి.. వాటిని అప్పగిస్తే ప్రజల నుంచి మాకు వ్యతిరేకత తప్పదు: గవర్నర్‌తో చంద్రబాబు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్‌కు తెలిపారు. గవర్నర్ నరసింహన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సమక్షంలో కేక్ కట్ చేసిన గవర్నర్ ఆయనకు కేకు తినిపించారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించడంపై గవర్నర్ ఆరా తీశారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నీ ఒకేసారి పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నామని అన్నారు. ఉమ్మడి సంస్థల విభజనతోపాటు అన్నింటినీ ఒకేసారి పరిష్కరించుకోవాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన నిధులు, ఆస్తులు నిలిచిపోయాయని, అవి రాకుండా భవనాలు అప్పగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే ఆ భవనాలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు కాబట్టి తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని గవర్నర్ అన్నారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ ఆ భవనాల్లో ఇంకా కొంతభాగం వినియోగంలో ఉందని, అమరావతిలో కొత్త సచివాలయ నిర్మాణం పూర్తికాలేదని గవర్నర్‌కు తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే వారిలో తాను మొదటి వాడినని పేర్కొన్న ముఖ్యమంత్రి 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన త్వరగా తేల్చేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్‌ను కోరారు.

  • Loading...

More Telugu News