: హైదరాబాదులో రెచ్చిపోతున్న వానర సైన్యం.. పలు కాలనీల వాసుల ఆందోళన
హైదరాబాదులో వానర సైన్యం బెంబేలెత్తిస్తోంది. కోతుల దెబ్బకు ఏం చేయాలో తెలియక పలు కాలనీల వాసులు బిక్కమొహం వేస్తున్నారు. బిల్డింగ్ లు, అపార్టుమెంట్లు.. ఎక్కడా చూసినా ఇవే కనపడుతున్నాయి. సైదాబాద్, మూసారాం బాగ్ లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎస్బీహెచ్ కాలనీ, కల్యాణ్ నగర్, న్యూ గడ్డి అన్నారంలో ఇళ్లల్లోకి చొరబడటమే కాకుండా స్థానికులపై పడి రక్కేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న ఈ కోతులు గడచిన మూడు రోజుల్లో పలువురిపై దాడి చేశాయి. కోతుల బారిన పడిన బాధితులు సుమారు వంద మంది వరకు ఉండవచ్చని సమాచారం. బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతుంటేనో, పాల ప్యాకెట్ తీసుకువస్తుంటేనో, ఇంట్లో వంట చేస్తున్న సమయంలోనో వెనుక నుంచి వచ్చిన కోతులు కరిచేస్తున్నాయని పలువురు బాధితులు ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ తో వాపోయారు.