: ప్రభుత్వ శాఖల వ్యవహారాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి: మండలి బుద్ధప్రసాద్
తెలుగు భాషలో కార్యకలాపాలు నిర్వహించినప్పుడే ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సామాన్యులు తెలుసుకోగలుగుతారని శాసనసభ ఆర్జీల కమిటీ చైర్మన్, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. విజయవాడలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన శాసనసభ ఆర్జీల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధికార భాషా చట్టం తప్పనిసరిగా అమలయ్యేందుకు శాసనసభ చేసిన చట్టాన్ని తప్పనిసరిగా అమలు జరిగేలా చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కార్యాలయాలు, విద్యాలయాలు, న్యాయస్థానాల్లో తెలుగుభాషను తప్పనిసరిగా అమలు చేయడం సాధ్యమేనన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాటు చేసే శిలాఫలకాలు సహా కార్యాలయాల బోర్డులన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.