: బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళుతున్న హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు పడ్డారు. ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. ఈ మేరకు కొందరు ప్రయాణికుల నుంచి రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందింది. 22691 నంబర్ గల రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంగళవారం రాత్రి ఆగ్రా, మధుర స్టేషన్ల మధ్య ఈ చోరీ జరిగినట్టు సమాచారం. ఏ1, ఏ2 కోచ్ లలోకి ప్రవేశించిన ఆగంతుకులు డజనకు పైగా మొబైల్ ఫోన్లు, రూ.60వేల నగదు, లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను దోచుకున్న తర్వాత చైన్ లాగి రైలు నుంచి దిగిపోయినట్టు ప్రయాణికులు తెలిపారు. చోరీకి గురైన సొత్తు ఎంతన్న దానిపై పోలీసులు ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.