: బుల్లెట్ గాయాల వల్లే సిమీ ఉగ్రవాదులు హతమయ్యారని తేల్చిన శవ పరీక్ష
భోపాల్ జైలు నుంచి పారిపోయి, చివరికి పోలీసుల కాల్పులకు బలైన సిమీ ఉగ్రవాదుల శవపరీక్ష నివేదిక విడుదలైంది. వారు పోలీసులు బుల్లెట్ గాయాలతోనే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం కరుడుగట్టిన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు భోపాల్ సెంట్రల్ జైలు గార్డు గొంతు కోసి, అక్కడి నుంచి పరారవుతుండగా నగర శివార్లలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎనిమిది మంది బుల్లెట్ గాయాల వల్లే ప్రాణాలు కోల్పోయారని, బుల్లెట్ గాయాలన్నీ కూడా నడుము పై భాగంలోనే అయ్యాయని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. కనీసం రెండు బుల్లెట్ గాయాలు, కొందరిలో అంతకంటే ఎక్కువే ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం విదితమే. వీటిని బీజేపీ తోపాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఖండించారు.