: విరహ వేదనతో మైసూరు ప్యాలెస్‌లో బీభత్సం సృష్టించిన ఆడ ఏనుగు
మైసూరులో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన దసరా ఉత్సవాల్లో జంబూ సవారీలో పాల్గొనడానికి వచ్చిన అర్జున ఏనుగుతో మైసూర్ ప్యాలెస్‌కు చెందిన 20 ఏళ్ల రాజీ అనే ఆడ ఏనుగు సాన్నిహిత్యం పెంచుకుంది. అయితే, ఉత్సవాలు ముగియగానే ఇటీవలే మగ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో రాజీ విరహంతో బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడమే కాకుండా తన దగ్గరకు ఎవ్వరినీ రానివ్వడం లేదు. తాజాగా ప్యాలెస్ ఆవరణలో అటూ ఇటూ పరుగులు తీసింది. ఏనుగును అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన మావటి పాషాపై సైతం దాడి చేయడానికి ప్రయత్నించింది. మావటి రాజీ బారి నుంచి చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం మావటిలంతా కలిసి రెండు గంటల పాటు శ్రమించి సదరు ఆడ ఏనుగును నియంత్రించారు.