: 11 ఏళ్ల తర్వాత వీడిన జంట హత్యల మిస్టరీ.. ఆ ఇద్దరినీ చంపింది నయీమ్ ముఠానే!


11 ఏళ్ల నాటి జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన మావోయిస్టు సానుభూతి పరులు జోడు ఆంజనేయులు, బెస్త కిష్టయ్యలను చంపింది నయీం ముఠానేనని పోలీసులు నిర్ధారించారు. నయీం డైరీ ఆధారంగా ఈ విషయం బయటపడినట్టు సీఐ రమేశ్‌బాబు మీడియాకు తెలిపారు. ఆంజనేయులు, కిష్టయ్యలు మావోయిస్టు సానుభూతిపరులన్న విషయం తెలిసిన గ్యాంగ్‌స్టర్ నయీం వారిని తన గ్యాంగ్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 2005న భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆంజనేయులు, కిష్టయ్య నగరానికి వస్తున్నట్టు నయీమ్‌కు సమాచారం అందింది. దీంతో తన అనుచరులైన డ్రైవర్ జెల్ల సత్యనారాయణ, యాదగిరి గుట్టకు చెందిన నర్సింగం పురుషోత్తం, మరికొందరిని ప్రజ్ఞాపూర్ వద్ద కాపలా ఉంచాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆంజనేయులు, కిష్టయ్యలను వీరు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత మరో వాహనంలో మియాపూర్‌లోని నయీం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నయీం వారితో మాట్లాడాడు. తమ గ్యాంగ్‌లో చేరమన్నాడు. దీనికి వారు వ్యతిరేకించడంతో వారిని చంపేయాలని అనుచరులను ఆదేశించాడు. దీంతో డ్రైవర్ సత్యనారాయణ, నర్సింగం పురుషోత్తం, నయీమ్ మేనకోడలు తనియాలు కలిసి ఆ తర్వాతి రోజు వారిని కారులో శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి, వారి మృతదేహాలను ఓ కాల్వలో పడేశారు. ఆంజనేయులు, కిష్టయ్యలను హత్య చేసింది నయీమ్ ముఠానేనని డైరీ ద్వారా తెలుసుకున్న పోలీసులు కోర్టు అనుమతితో డ్రైవర్ సత్యనారాయణ, పురుషోత్తంలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారంతో ఇస్లాంపూర్‌కు చెందిన యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నయీమ్ మేనకోడలు తనియా అలియాస్ సాజిదా షాహినాను అరెస్ట్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News