: టూత్‌బ్రష్, చెక్క సాయంతో సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)కి చెందిన 8 మంది ఉగ్రవాదులను పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. వారు జైలు నుంచి పారిపోవడంపై దర్యాప్తు చేసిన అధికారులకు పలు విషయాలు తెలిశాయి. ఉగ్రవాదులు టూత్‌బ్రష్, చెక్కతో మారు తాళంచెవి తయారుచేసుకున్నారని, వాటి సాయంతోనే బ్యారక్ గది తాళాలు తీశారని అధికారులు గుర్తించారు. తప్పించుకునే క్రమంలో జైలులో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు అక్కడి నుంచి భోపాల్ శివారులోని కేజ్రా నుల్లా ప్రాంతానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు ఉగ్రవాదులను చుట్టుముట్టడంతో వారు తుపాకులు, పదునైన ఆయుధాలతో పోలీసులపై దాడికి దిగారని చెప్పారు. ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు వరుసగా 43 రౌండ్ల కాల్పులు జరిపారని, దీంతో ఎనిమిది మండి ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారని పేర్కొన్నారు.