: ఇండియాలో ఒక మాట.. స్వదేశానికి వెళ్లాక మరో మాట.. బహిష్కృత పాక్ గూఢచారి
న్యూఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయంలో పని చేస్తూ, సైన్యానికి చెందిన రహస్య పత్రాలను తన దేశానికి చేరుస్తున్నాడన్న ఆరోపణలపై దేశ బహిష్కరణకు గురైన మెహమూద్ అఖ్తర్, తన దేశానికి వెళ్లి మాటమార్చాడు. "వారు నన్ను అదుపులోకి తీసుకున్న తరువాత ఓ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. వారు అప్పటికే రాసిన ఓ స్టేట్ మెంట్ ను నాతో బలవంతంగా చదివించారు. అందులో నలుగురు దౌత్యాధికారుల పేర్లు ఉన్నాయి. వారంతా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కు చెందినవారని చదివించారు" అని 'డాన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను నిజాముద్దీన్ సమాధుల వద్దకు తిరిగొస్తున్న సమయంలో జంతుప్రదర్శనశాల వద్ద అరెస్ట్ చేశారని, తనను కొట్టారని, ఆపై తనతో బలవంతంగా ముందే రాసిన ప్రకటన చదివించి దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారని అన్నాడు. కాగా, ఈ ప్రకటనలో వినిపించిన నలుగురు ఉద్యోగులనూ ఇండియా నుంచి వెనక్కి పిలిపించాలని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దౌత్య కార్యాలయంలో కమర్షియల్ కౌన్సిలర్ గా ఉన్న సయ్యద్ ఫుర్రుఖ్ హబీబ్, కార్యదర్శులు ఖాదిమ్ హుస్సేన్, ముసాస్సిర్ చీమా, షాహిద్ ఇక్బాల్ లను వెనక్కు పిలిపించనున్నామని, ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.