: తెలంగాణను వదిలి ఏపీకి మకాం మార్చనున్న పవన్ కల్యాణ్... రాజకీయ పార్టీగా జనసేనను బలోపేతం చేసేందుకే!
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓటరుగా, తెలంగాణ పౌరుడిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏపీకి మకాం మార్చాలని తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళికే ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండున్నరేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఈ లోగా జరిగే వివిధ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో జనసేనను రాజకీయ పార్టీగా బరిలోకి దింపే ఆలోచనతో ఉన్న పవన్ కల్యాణ్, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిని సారించి ఏలూరులో ఓటరుగా నమోదు కావాలని నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఆఫీసుగా, తన నివాసంగా ఉపయోగపడే భవనాన్ని ఏలూరులో గుర్తించాలని ఆయన తన కార్యకర్తలకు సూచించిన సంగతి తెలిసిందే. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా పార్టీల్లో కుతూహలాన్ని రేకెత్తించగా, పవన్ ఆలోచన ఏంటని వివిధ పార్టీల వారు జనసేన నాయకులను అడుగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క, ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ పడుతుందని జనసేన అధినేత వెల్లడించగా, తాజా చర్యలతో గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చేందుకు పవన్ ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఉంటే జనసేనను బలోపేతం చేయడంతో పాటు, ప్రజల మధ్య ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన ఉండదా? ఉంటే ఇక్కడ బలోపేతం చేయాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ ను వదిలి ఏపీకి వెళితే తెలంగాణలో పార్టీ కార్యకర్తల మనోధైర్యం తగ్గదా? అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పవన్ కల్యాణ్ నోరు విప్పితేనే సమాధానాలు తెలుస్తాయి.