: పోలీసులు దుర్భాషలాడటంతో ఆందోళనకు దిగిన టీడీపీ ఫ్లోర్ లీడర్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులు తనతో దుర్భాషలాడటంతో టీడీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు నిరసనకు దిగారు. దీపావళి పండుగ సందర్భంగా నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆందోళన తెలుపుతున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు దుకాణాలను మూయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న ఓ బేకరీని మూసేయాలని చెప్పారు. దీంతో శ్రీనివాసరావుకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆయన ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే పయత్నం చేశారు. అయినా శ్రీనివాసరావు తన ఆందోళనను విరమించలేదు. నగర ప్రజల పట్ల పోలీసుల తీరు బాగోలేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని శ్రీనివాసరావు ఆరోపించారు. తనకు పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఆందోళనకు మద్దతు తెలుపుతూ టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు.