: ‘ఐఫోన్7’ కోసం పేరు మార్చుకుని దాన్ని సంపాదించుకున్న యువకుడు
యాపిల్ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఐఫోన్-7 పట్ల యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఫోను తమ సొంతం చేసుకోవాలని ఎన్నో కష్టాలు పడుతుంటారు. దాని ధర అధికంగా ఉండడంతో ఎంతో మంది ఆ ఫోనుకి దూరంగానే ఉంటున్నారు. అయితే, ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద మొబైల్ రిటైల్ వెబ్‌సైట్‌లో ఒకటైన ‘అల్లో.యూఏ’ ఇటీవలే ఓ ఆఫర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వేలల్లో డబ్బులు పెట్టి కొనే అవసరం లేకుండా వినియోగదారులు ఐఫోన్-7ని ఉచితంగా సొంతం చేసుకోవచ్చని అయితే, అందుకోసం తమ పేరును మార్చుకోవాల్సి ఉంటుందని ఓ షరతు పెట్టింది. వినియోగదారుడు తన పేరుకు బదులుగా మొదటి పేరుని ఐఫోన్ అని, రెండో పేరుని 7 అని మార్చుకోవాలని ప్రకటించింది. ఈ షరతు పట్ల అంగీకారం తెలిపిన ఓ ఐఫోన్ ప్రేమికుడు తన పేరును ‘ఐఫోన్7’ గా మార్చుకున్నాడు. పేరు మార్చుకున్న వ్యక్తి తనకు సర్కారు ఆమోదముద్రతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో సంస్థను సంప్రదించాడు. తమకు వచ్చిన దరఖాస్తుల్లో మొదట పంపిన ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామని చెప్పిన సంస్థ.. పేరు మార్చుకొని తమ వద్దకు వచ్చిన ఉక్రెయిన్‌కు చెందిన ఈ 20 ఏళ్ల యువకుడు అలెగ్జాండర్ తురిన్‌కి ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది. దీనిపట్ల ఐఫోన్7 గా పేరు మార్చుకున్న అలెగ్జాండర్ తురిన్‌కి ఎంతో హర్షం వ్యక్తం చేశాడు. తనకు 850 యూఎస్ డాలర్ల విలువ చేసే ఐఫోన్ ఉచితంగా వచ్చిందని సంబరపడిపోయాడు. తన పేరులో మార్పు కోసం తనకు రెండు డాలర్ల ఖర్చు మాత్రమే అయిందని చెప్పాడు. అయితే, భవిష్యత్‌లో తన పేరును తిరిగి అలెగ్జాండర్ తురిన్‌గానే మార్చుకుంటానని అన్నాడు.