: భోగాపురం, పూసపాటి రేగల్లో భారీ వర్షం...మ్యాచ్ జరుగుతుందా?
కయంత్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. విశాఖకు 200 కిలోమీటర్ల దూరంలో తిష్టవేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగల్లో భారీ వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వైజాగ్ ను నేటి ఉదయం చిరుజల్లులు పలకరించాయి. నిన్నంతా వైజాగ్ లో మబ్బులుపట్టాయి. స్టేడియం కూడా జాతీయ రహదారిని ఆనుకుని సముద్రానికి దగ్గర్లో కొండల నడుమ ఉండడంతో వర్షం భయం నెలకొంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయా? ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఏసీఏ-వీడీసీఏ అధికారులు మీ సేవాకేంద్రాల్లో అమ్మకానికి పెట్టిన అరగంటలోనే 400 రూపాయల టికెట్లు అమ్ముడైపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి వాతావరణంపై ఉత్కంఠ నెలకొంది. వరుణుడు కరుణిస్తే రేపటి మ్యాచ్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం వైజాగ్ లో ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో టీమిండియా, కివీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపు మ్యాచ్ జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు.