: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికోసారి పూర్తి వైద్య పరీక్షలు.. జీవితాంతం మందులు ఫ్రీ!
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికోమారు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు జీవితాంతం ఉచితంగా మందులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఉద్యోగుల ఆరోగ్య పథకం(హెల్త్ స్కీం) అమలులో మార్పులు చేయాలని నిర్ణయించింది. వచ్చేనెల తొలి వారం నుంచే అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్యసదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఓపీ సేవల కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ఆరోగ్య పథకంలో సమస్యలు తలెత్తడం, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరల విషయంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అసంతృప్తిగా ఉండడంతో ఆయా ఆస్పత్రులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా పథకం అమలులో ఉన్నా ఉద్యోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన సర్కారు హెల్త్ స్కీంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. అలాగే వివిధ డయాగ్నస్టిక్ సెంటర్లతోనూ ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికోమారు పూర్తి వైద్య సేవలతోపాటు జీవితాంతం ఉచితంగా మందులు అందనున్నాయి. వచ్చే నెల మొదటి వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.