: జూబ్లీహిల్స్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్.. తనిఖీల్లో 500 మంది పోలీసులు.. 52 మంది అరెస్ట్, 62 బైకుల సీజ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని జవహర్‌నగర్ బస్తీలో బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. పోలీసులు మొదట బస్తీలోకి వెళ్లే మార్గాలను మూసివేశారు. అనంతరం నాలుగు వందల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. 53మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8 మంది రౌడీషీటర్లు ఉన్నారు. సరైన పత్రాలు లేని 62 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. పది వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్న పోలీసులు ఈసారి కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ‘సీ గార్డ్’ అనే యాప్ ద్వారా ఇక్కడ నివసించే వారి ఫోన్ నంబర్లను పోలీసులు యాప్‌లో నమోదు చేసుకున్నారు. దీనివల్ల వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని డీసీపీ తెలిపారు.