: భారతీయులను వివాహమాడి అహ్మదాబాద్ లో ఉంటున్న పాకిస్థానీ అక్కాచెల్లెళ్లు అదృశ్యం


గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఇద్ద‌రు పాకిస్థానీ సోద‌రీమ‌ణులు అదృశ్య‌మ‌య్యారు. వీరిరువురూ అహ్మదాబాద్ నగరంలోని పాల్దీ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ మెమన్, మహ్మద్ సోహెబ్‌ అనే సోదరుల‌ను పెళ్లి చేసుకొని అదే ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే, పాక్ సోద‌రీమ‌ణులు ఇద్ద‌రూ త‌మ పిల్ల‌ల‌తో స‌హా పాస్ పోర్టులు, వివాహ‌ స‌ర్టిఫికెట్లు తీసుకొని క‌నిపించ‌కుండా పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వీరు త‌మ ఇంటినుంచి వెళ్ల‌డాన్ని గుర్తించారు. ఈ పాకిస్థానీ అక్కాచెల్లెళ్ల పేర్లు ఆయేషాబీబీ, నవీరాబీబీ అని పోలీసులు పేర్కొన్నారు. ఆయేషాబీబీ అహ్మ‌దాబాద్‌కు నాలుగేళ్ల క్రితం రాగా, న‌వీరాబీబీ రెండేళ్ల క్రితం వచ్చిందని తెలిపారు. అయితే, వారు పాకిస్థాన్ దేశానికి వెళ్లలేరని, వీసా జారీ కోసం తమ అనుమతి పొంద‌వల‌సి ఉంద‌ని పేర్కొన్నారు. ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News