: విరాళాలు డిమాండ్ చేయడం మంచిది కాదని రాజ్ థాక్రేను వారించా: ఫడ్నవిస్
'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి బ్రోకర్ లా మారారని... పాకిస్థానీలకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించింది. సినిమా విడుదల వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో, ఫడ్నవిస్ కల్పించుకున్న సంగతి తెలిసిందే. దర్శకనిర్మాతలకు, ఎమ్మెన్నెస్ పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఫడ్నవిస్... చివరకు సమస్యను పరిష్కరించారు.
శివసేన తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఫడ్నవిస్ స్పందించారు. "సమస్యకు సంబంధించి నా ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి థియేటర్ల ముందు పోలీసులను మోహరించడం. రెండోది, ఇరు వర్గాలతో చర్చలు జరపడం. పోలీసులను మోహరిస్తే, దీపావళి నాడు వారంతా వారి కుటుంబాలకు దూరమవుతారు. అంతేకాదు, ఆందోళనలు దారి తప్పితే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే నేను చర్చలకు మొగ్గు చూపా" అని తెలిపారు.
చర్చల సందర్భంగా రాజ్ థాకరే మూడు డిమాండ్లు పెట్టారని... అందులో అమర జవాన్లకు నివాళి అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడానికి ఇరు వర్గాలు అంగికరించాయని చెప్పారు. సైనిక సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలన్న రాజ్ థాకరే డిమాండ్ ను మాత్రం తాను అక్కడికక్కడే ఖండించానని... సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని చెప్పినట్టు తెలిపారు. ఎమ్మెన్నెస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు సరి కాదని అన్నారు.