: నా కుమారుడి సినిమాను ఎలా అడ్డుకుంటారో నేనూ చూస్తా: మాజీ సీఎం కుమారస్వామిగౌడ వార్నింగ్
తన కుమారుడు నిఖిల్ హీరోగా నటించిన 'జాగ్వార్' సినిమాను థియేటర్ల నుంచి తీసివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినీ రంగంలోని కొంతమంది వల్ల శాండిల్ వుడ్ పరిశ్రమ అప్రతిష్టపాలవుతోందని మండిపడ్డారు. దీపావళి సందర్భంగా ఇద్దరు అగ్రనటుల సినిమాలు విడుదల అవుతున్నాయని... దీంతో, ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతున్న జాగ్వార్ సినిమాను థియేటర్ల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తాను కూడా గతంలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించానని... అయితే ఇతర చిత్రాలకు నష్టం కలగని రీతిలో, అందుబాటులో ఉన్న ఇతర థియేటర్లలోనే విడుదల చేసుకునేవారిమని చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్న కొందరి చేతుల్లో ఇండస్ట్రీ నలిగిపోతోందని కుమారస్వామిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల విజయవంతంగా ఆడుతున్న జాగ్వార్ సినిమాను థియేటర్ల నుంచి ఎలా తొలగిస్తారో చూస్తానని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఈ సినిమాను యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో విడుదల చేయనున్నట్టు చెప్పారు.