: మాతృభాషను మర్చిపోలేకపోతున్న పులి.. హిందీ రావడం లేదంటూ తలలు పట్టుకుంటున్న జూ సిబ్బంది
మాతృభాషపై మమకారం పెంచుకున్న ఓ పులి.. ఇప్పుడు ఉదయ్‌పూర్ జూ సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. దానికి హిందీ రాక, వీరికి తమిళం రాకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జంతుమార్పిడి పథకం కింద ఆమధ్య చెన్నైలోని వండలూరు జూ నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జూకు 'రామా' అనే తెల్ల చిరుతపులిని తీసుకొచ్చారు. జూకు తెల్లపులి రావడంతో సంతోషంగా ఉన్న సిబ్బందికి అసలు సమస్య అక్కడే ప్రారంభమైంది. తమిళనాడులో పెరిగిన ‘రామా’ అక్కడి జూ సిబ్బంది మాట్లాడే తమిళంను బాగా వంటబట్టించుకుంది. కానీ ఇక్కడి సిబ్బంది హిందీలో మాట్లాడుతుండడంతో ఆగ్రహంతో చిందులు వేస్తోంది. వారేం మాట్లాడుతున్నారో తెలియక కోపంగా చూస్తోంది. మాంసాన్ని ముందుపెట్టి ‘ఖావో’ అంటే వాసన చూసేందుకు కూడా రావడం లేదు. అదే ‘సాప్పిడుడా రామా’ అనగానే ఒక్కుదుటన వచ్చి లాగించేస్తోంది. ఈ బాధలు పడలేని జూ సిబ్బంది ఏకంగా వండలూరు జూ నుంచి చెల్లయ్య అనే వ్యక్తిని పిలుపించుకుని అతడు చెప్పే మాటలను బట్టీ పట్టారు. అయినా సమస్య మాత్రం తీరలేదు. ఎందుకంటే వారు మాట్లాడే తమిళ ముక్కల్లో హిందీ యాస ఉండడమే అందుకు కారణం. దీంతో ఆయా తమిళ పదాలను ఎలా పలకాలన్న దానిపై ‘రామా’ ఆలనా పాలనా చూస్తున్న రామ్‌సింగ్‌కు చెల్లయ్య పాఠాలు చెబుతున్నాడు. మాతృభాషపై మమకారం తమిళులకే కాదు, తనకూ ఉందని నిరూపించిందీ తెల్లపులి.