: అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదు... రికార్డు సృష్టిస్తున్న అమెరికా ఓటర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉందన్న విషయం తెలిసిందే. ఆ దేశ ఓటర్లు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఓటర్ల రిజిస్ట్రేషన్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అమెరికా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రిజిస్ట్రేషన్లు నమోదయినట్లు డెమోక్రటిక్ పొలిటికల్ డేటా సంస్థ టార్గెట్‌స్మార్ట్ పేర్కొంది. ఈ ఎన్నికల కోసం ఇప్పటివరకు 200 మిలియన్లకు పైగా అమెరికన్లు ఓటు వేసేందుకు రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది. గతంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను పరిశీలిస్తే 2008లో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పోటీ చేసిన ఎన్నికల్లో 146.3 మిలియన్ల అమెరికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇప్పుడు 50 మిలియన్ల కొత్త ఓటర్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని పేర్కొంది. వీరిలో 42.6 శాతం మంది డెమోక్రటిక్ పార్టీకి మద్దతు తెలుపుతోంటే, 29శాతం మంది ప్రజలు రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారట. ఇక మిగతా 28.4 శాతం మంది స్వతంత్ర పార్టీకి మద్దతు పలుకుతున్నారు. 131.4 మిలియన్ల మంది 2008లో ఓటు హక్కును వినియోగించుకుంటే, 2012లో 129.2 మిలియన్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.